ఆంధ్రప్రదేశ్
దేవర రివ్యూ రేటింగ్ : 3.25/5, by AP TODAY NEWS
దేవర హిట్టు, పాదఘట్టం క్రెడిటు
పాదఘట్టమనే బాధఘట్టం నుండి కొరటాల శివగారు కిందామీదా పడి ప్రేక్షకాభిమానుల కన్నెఱ్ఱసముద్రం ఈది ఒడ్డు చేరి గట్టునపడ్డారు. కాగలకార్యం గంధర్వులు తీర్చినట్టు, SSR-CURSE అన్న అపవాదును తారక్ అనే నటగంధర్వుడు తీసవతల పడేశాడు కూడా.
సినిమా పేరు : దేవర Part -1
విడుదల తేదీ : సెప్టెంబర్ 27, 2024
AP Today News రేటింగ్ : 3.25/5
నటీనటులు : Jr.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్,శృతి మరాఠే తదితరులు.
దర్శకుడు : కొరటాల శివ
నిర్మాత : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు
కథ:
ట్రైలర్ లో ఉన్నదే. కాకపోతే మనం ఊహించుకున్న కథకు ఇంకాస్త మెరుగులు దిద్దారు. రచయితల టీంని చాలావరకు మెచ్చుకోవాలి. అనుకున్నదే జరుగుతూంది అనుకుంటున్నపుడు, కూరకు రుచి తెచ్చే పోపులా, కొన్ని సంభాషణలు రక్తి కట్టించి మురిపిస్తాయి. కానీ, అవే సంభాషణలు, అసలుసిసలు కథవరుసలో పర్లేదు కానీ, మిగిలిన సన్నివేశాల్లో(కథకు సహకరించే పక్కవాద్యాల్లాంటి, హాస్య సన్నివేశాల్లో) తేలిపోయి, “ప్చ్” అని పెదవి విరిపిస్తాయి కూడా.
కథనం:
కథలో, నాయకానాయికేతర ముఖ్యపాత్రలను వ్రాసుకున్న తీరులో బిగి తగ్గి, మొత్తం భారమంతా హీరోపాత్రల మీద పడిపోవడమే కొరటాల & కో క్రితం prestegious project లో, డైరెక్షన్ & రైటింగ్ టీం ఏమరుపాటుగా ఉన్న అంశం. ఈసారలా కాకుండా శాయశక్తులా కష్టపడ్డారని తెలుస్తున్నా, ఇంకా అక్కడక్కడా కొరటాలమార్కు క్రింజి-జాడలు కనపడి కొంచెం కెలుకుతాయి కూడా. ఇక్కడే రచయితల టీం పడిన జాగ్రత్తలు, మరీ ముఖ్యంగా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గార్ల పనితనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
పాత్రల తీరుతెన్నులు:
తారక్ నటనాకౌశలంలో ఒక అక్షయపాత్ర లాంటివారు. ఎంత తీసుకుని ప్రేక్షకులను అలరించినా ‘ఇంకా ఉంది ఈయనలో సరుక’నిపించే అతికొద్ది నటులలో తారక్ అగ్రగణ్యులు. తండ్రి పాత్రను గాంభీర్యానికి, రౌద్రకారుణ్యాదయాద్రతల వరకే పరిమితం చేసినా, మిగిలిన బేలతనం, హాస్య, నిస్సహాయతలను కొడుకు పాత్రలో పండించారు. అదే సమయంలో రెండు పాత్రస్వభావాల్లోనూ సందర్భానుసారం పరిణితిని కనబరచడం ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం. కథలో ఉత్కంఠ రేపడానికి మొదట్నుండి కడదాక కనపడే పాత్రల్లో ప్రకాష్రాజ్ గారి పాత్ర, మేకప్ సహకరించకున్నా, కథకు మాత్రం అనుకూలమే అవుతుంది. అమ్మ పాత్రలు మెప్పిస్తాయి. ప్రతినాయకపాత్రలో కర్కశం, నయవంచన, మటుకే చూపించడం వల్లనేమో, సైఫ్ అలీఖాన్ గారిని వాడుకున్నది తక్కువే అనిపిస్తుంది. రెండో భాగంలో వీలైనంత వాడుకుంటే మేలు సైఫ్ గారిని. జాన్వీ చేత పెంకితనం తక్కువ చేయించి, హీరోకోసం పడిచచ్చిపోతుండడం వరకే పరిమితం చేసి కథానాయిక పాత్రను పరిమితంగా ఉంచినట్టు అనిపించినా, దీనికి కూడా రెండో భాగంలో న్యాయం చేసే అవకాశం, అవసరం మెండుగా ఉంది.
విశ్లేషణ:
వరెన్ని ఊహాగానాలు చేసినా, నర్మగర్భంగా మాట్లాడినా, చివరికి స్వయంగా దర్శకులే ఇంటర్వ్యూల్లో బయటికెళ్ళబోసుకున్నా సరే, సినిమా హిట్టవ్వడానికైనా, ఫ్లాపవ్వడానికైన ప్రప్రథమమూ చివరాఖరి కారణం కచ్చితంగా దర్శకుడే. ఇది నిర్వివాదాంశం. దర్శకుడంటేనే చూసేవాడు, చూపించేవాడనే కదా. వీలైనన్ని చూసుకోవాలి. కొన్ని
ఏమరపాటులో చూసుకోకుంటే, కళ్ళు బైర్లు కమ్మెలా ప్రేక్షకులు చూస్కుంటారు. ఇది ఎరుకలోకి రావడం నిరుటి “పాదఘట్టం” పుణ్యమే.
కొరటాలగారి ఫిల్మోగ్రఫీ చూస్తే, ఓ శక్తివంతమైన సంభాషణలకు నాయకప్రతినాయకుల హావభావాలు జోడించి, వెండితెరపై వీరోచిత కథలతో యువతను ఉర్రూతలూగించారు. కానీ, దురదృష్టవశాత్తూ, శివగారి రచనా పటిమని, హీరోల నటన కమ్మేసింది. కానీ ఇదే ప్రేక్షకులని శక్తిమేర అలరించింది కూడా. Go with the flow అన్న చందాన శివగారు కూడా, star-charisma మీద ఎక్కువ అధారపడుతూ వచ్చి, పాదఘట్టం దగ్గర నేలమట్టమయ్యారు.
కథనం ఎప్పుడూ, యత్కించిత్ ఉత్సుకతను ఉంచుకుంటూ, ముఖ్యపాత్రల ద్వారా కథాబలాన్ని పెంచుకుంటూ, అవసరమైన చోట అర్హతగలపాత్రలకు పగ్గాలిచ్చి కథాగమనాన్ని మేలిమలుపులు తిప్పిస్తూ, పరుగులు పెట్టించాలి. కథపట్ల నిజాయితీతో కొన్ని చోట్ల పాత్రలే తగ్గాలి. అలా చేయకపోవడంవల్లే మునుపు మనల్ని ఇబ్బంది పెట్టి, ఆయన కూడా పడ్డారు. ఇప్పుడు ఆ జాగ్రత్తలన్నీ దాదాపు పాటించి నిలబడి నిలబెట్టారు. అనిరుధ్ సంగీతం కథనాన్ని అత్యవసరమైన చోట్ల బలపరించింది. అందరికంటే ఎక్కువ కష్టపడ్డ సాబుసిరిల్ గారి పనితనం తెరనిండుగా కనపడింది. రెండు తెలుగురాష్ట్రాల సినిమా అనే స్థాయి నుండి జాతీయస్థాయి commercial cinema అనిపించి కనిపించడంలో సాబుసిరిల్ గారి కష్టమే ఎక్కువ తోడ్పడింది
ససమీక్షవీక్షణం:
తెల్లారకముందే, ఫస్టాఫ్ లాగారని, సెకండాఫ్ ల్యాగనీ, పాడిందే పాటరా పాచిపండ్లమల్లిగా అని పల్లికిలించినట్టు వ్రాస్తున్నారు రివ్యూలు. విరామానికి ఆ పోరాటసన్నివేశాలు పడాలి ఈ కథాకథనాలకు. అందుకే, విరామం కాస్త ఆలస్యంగా వచ్చేలా చూస్కున్నారు. రెండోఅర్థం, తొందరపాటులో లాగేసి పతాక(క్లైమాక్స్)సన్నివేశాలకి దారితీసారని కూడా వెక్కిరించడానికి విఫలయత్నం చేస్తున్నారు కొందరు అంతర్జాలమార్జాలాల్లాంటి సినీవెబ్సైట్లు. సినిమాను నమ్ముకుని బ్రతుకుతూ, సినీపరిశ్రమలో పనిచేసేవారి కఠోరశ్రమలను ఖాతరుచేయకుండా, తమ credibility అని భ్రమపడి, నీతినిజాయితీలను పణంగా పెట్టి, click baitలు రెచ్చగొట్టే contentల మాటున, నిష్టూరాలనే అమ్ముకుని బ్రతుకుతున్న సినీజర్నలిజం నుండి ఇంతకన్నా ఆశించలేం. దేవర మొదటిభాగంలోని పతాక సన్నివేశంలో, సగటు ప్రేక్షకులు ఊహించినదే అయినా కూడా, ఎంతో కీలకమైన పరిణామం, అనవసరహడావిడికి తావివ్వకుండా, చక్కగా హ్యాండిల్ చేశారు. అందుకు చివర్లో cliffhanger కాస్త కూడా తోడ్పడుతుంది. “అనుకున్నదే జరిగినా, అనుకున్నట్టు అనుకున్నపుడు జరగకూడదు” అని ఇటీవల పరుచూరిగారు పునరుద్ఘాటించిన సినీఉపనిషద్వాక్యానికి దేవర క్లైమాక్స్ ఓ ఉదాహరణ.
మరింకేం బొమ్మ భీభత్సం, రికార్డులు బద్దలేసిపోతాయా అంటే, క్షమించండి. ప్రస్తుతం పెట్టింది తిరిగోస్తేనే హిట్టు అని జగద్విదితం. ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు & టీం గెలిచారు. ఎంతపెద్ద హిట్టనేది మాత్రం కుటుంబసమేత ప్రేక్షకుల అనుగ్రహం. మరి ఫ్యాన్సుకు? ఒట్టి ఫుల్ మీల్స్ కాదు, ఒకటీ అరా కూరల్లో ఉప్పుకారాలు కాస్త తగ్గినా పండగనాటి పంచభక్ష్యపరమాణ్ణ భోజనం. అంటే, అలా కొంచెం కుదరని కూరలను పండుగ విస్తరిలోంచి తీసి పాడేయం కదా, బాగున్నవి ఇంకా వడ్డించుకొని తింటాం. ఇక్కడా అంతే.
మొత్తానికి:
సినిమా బాగుంది. సాహిత్యం మెరుగ్గా ఉంది.
Rating – 3.25/5.
కొరటాల శివగారికి(వారి టీం కి కూడా)ఇది పాక్షిక పునరాగమనం(Come back). వారికన్నా ఎక్కువగా ఇది తారక్ గారి గట్టి పునరాగమనం
కొసమెరుపు:
ఏవైతే సినిమాని బలంగా నిలబెట్టాయి అనుకున్నామో, అవే రచనాపరమైన అంశాలు ఇంకాస్త మెరుగు పరచి ఉండొచ్చనిపిస్తుంది. ఇలా మెరుగులు దిద్దడం ప్రతీ ప్రింట్/ఆన్లైన్ మీడియాలో చులాగ్గ చెప్పేస్తారు గాని, ఎక్కడ ఎలా మెరుగులద్దాలో చెప్పరు/చెప్పలేరు అని సమీక్షకులపై ఇక ఆరోపణ ఉంది. నిజం కూడా. అలా అనుకుని తీసిపారేయకుండా ఒక చిన్ని ఉదాహరణ:
ఒకచోట, దాదాపుగా ఇలా ఒక డైలాగ్ (ఇది ట్రెయిలర్లో కూడా)ఉన్నట్టుంది… “అలలు తీరానికి వచ్చినట్టు తిరిగిరాడు నీ కొడుకు” అని. దాన్ని క్రింది విధంగా వ్రాసుంటే ఇంకా బలంగా ఉండేదని(ఈ సమీక్షకుడి) వ్యక్తిగత అభిప్రాయం.
“నట్టనడి సంద్రంలో నీళ్ళైనా, అమాసపున్నాలకి పోటెక్కువయ్యి తీరం తాకిపోతాయేమో, నీ కొడుకు పుష్కరానికొక్కసారి కూడా రాడు.”
– Rn ఆర్యన్, AP Today News
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 67884